సొసైటీ సైంటిస్ట్ పుస్తకానికి వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు రాసిన ముందు మాట :
అన్వేషణ
మనిషి వేద కాలానికి ముందు నుండి కూడా తన మేధస్సు పరిమితికి లోబడి తన చుట్టూ ఉన్న ప్రకృతిని ప్రశ్నించుకుంటూ దొరికిన సమాధానాలతో సమాధానపడుతూ తన జ్ఞాన పరిశోధనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ దశలో వివిధ సిద్ధాంతాలు, శాస్త్ర ఆవిష్కరణలు సాక్ష్యాలుగా మార్చుకునే ప్రయత్నం నిరంతరం చేస్తున్నాడు. ఐతే “ ఇది “ అనే ఇదమిద్ధమైన సత్యమైన సమాధానం లభించేంత వరకూ అన్ని ఆలోచనల పై చర్చోపచర్చలు సహజమే కదా !! నేరుగా నా విద్యార్థి కాకపోయినప్పటికీ శ్రీ కలవలపల్లి శ్రీనివాసు, తనదైన ఆలోచనాత్మక వైఖరితో , తోటి యువకులకు భిన్నంగా జ్ఞానతృష్ణ కలిగిన విద్యార్థిగా నా అభిమానానికి కారణమయ్యాడు. అతడు తన మనసులో నిండి ఉన్న ఆలోచనలన్నిటిని “ బిలాంకిజం “ అనే పేరుతో ఈ పుస్తకములో పెట్టే ప్రయత్నం చేసాడు. వివిధ అంశాల పై విభిన్న ధృక్పదంతో విశ్లేషించే ప్రయత్నం చేసే తీరు అభినందించదగినది. భవిష్యత్ లో మరింత లోతైన విస్తృతమైన పరిశోధన వైపు గా అతని ప్రయాణం సాగుతుందని ఆశిస్తున్నా. చాలామంది ‘ సోషల్ మీడియానందం’తో కొట్టుకుపోతూ అజ్ఞానులుగా మారుతున్న యువతకు ఈ పుస్తకంలో లేవనెత్తిన ప్రశ్నలైనా వారి దృష్టి కోణాన్ని మార్చడానికి ఉపకరిస్తుందేమో అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఈ చిరంజీవికి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను . “ అనంతం .. జ్ఞానం”
”GVVSV ప్రసాద్ బాబు , M.Com, DBF (CFA),NET (Ph.D) వాణిజ్య శాస్త్ర అధ్యాపకులు, డా “ వి.ఎస్.కృష్ణా డిగ్రీ కళాశాల, విశాఖపట్నం.

Post Comment